నదులంటే పొలాల తనువులకు శాశ్వత రక్తదాతలు,
పొలాలు మానవాళికి అవయవదాతలు,
మనుషులే ఒకవైపు నదుల రక్తం కలుషితం చేస్తూ
మరోవైపు రక్తహీన పొలాల పొదుగులకు వ్రేలాడే లేగదూడలవుతారు.
నదులంటే నా గుండెపడవ చాప కిందినుండి ప్రవాహించే
కరగని బండరాతి హృదయాల మీంచి వలసొచ్చిన గతకాలపు జ్ఞాపకాల కన్నీరు,
నదులను ప్రేమించినంతగా ప్రియా నిన్ను ప్రేమించలేకపోయాను
ఎందుకంటే నీకన్నా నువ్ లేవనే బాధనే నాకు ఎక్కువ ఇష్టం.
నదులంటే మట్టి మాంసం తిని ఇసుక అస్థిపంజరాలను వదిలిపోయే క్రూర జంతువు,
ఇక్కడ మట్టి మాంసం తిని సుష్ఠుగా బలిసిన నది
మరోచోట మట్టి కడుపుకే మాంసం అవుతుంది ఏదోఒక పొలంలో.
నదులంటే పడవల లగేజీని మోసే చేపల కూలీలకు ఓ అడ్డా,
చేపల చెమట చుక్కలే నదిని పోషించే కిరాయి.
నదులంటే వీధి రౌడీలు
పోతూపోతూ తీరాన చెట్టుకు
పక్వానికి వచ్చిన పిందెలను, కాయలను లాక్కెళ్లిపోతారు.
S యాది