బతుకును తల్సుకొని
తనివితీరా ఏడ్వడానికి
ఒక వాక్యం కావాలి
కొండమల్లెల నవ్వులు
తేటనీరు మాటలు
గుండెల్ని పూలవనం చేసే
కొన్ని చినుకులు కావాలి.
నన్ను నన్నుగా అభిమానిస్తూ
ఎదను అల్లుకుపోయే
కొన్ని దుసరితీగలు కావాలి
ప్రేమగా గొడువపడే
కొందరు మనుషులు కావాలి
మా తమ్ముడొచ్చిండని
కలిసినోళ్ళందరికి సంబురంగ చెప్పె
ఒక అపురూపం కావాలి
ఉన్నవో, లేవో అని
జేబులో కొంత ప్రేమను బెట్టి
బస్సు కదిలిందాక నిలబడే
ఒక దృశ్యం కావాలి
చేస్తున్న పనిని మధ్యలోనే ఆపి
తడిచేతులను బట్టలకు రాసుకొని
చికెన్ షాపు నుండి ఉరుక్కుంటొచ్చిన
మా ఆసిఫ్ లాంటి పావురాలు కావాలి
నోటినిండా వేసుకుంటే
నాలుకంతా ఎర్రబడినట్టుగానే
బతుకును వర్ణమయం చేసే
అడివితులసి పత్రి,తంగేడుకొమ్మ చిగుర్ల లాంటి
రంగువెలువని స్నేహం కావాలి.
ఈ ఊపిరితాడు
తొందరగా తెగిపోకుండా ఉండటానికి
ఈ నడక
ఇలా మధ్యలోనే ఆగిపోకుండా ఉండటానికి
కొన్ని ప్రేమలు,కొంత పరిమళం కావాలి
తగుళ్ళగోపాల్ 9505056316