నీ నల్లని శిరోజాల నదిలో
ప్రతి ఉదయం తురుముకొస్తావ్ పూల పడవలను,
అవి మోసుకొచ్చే పరిమళాలను
గాలి కూలీలు నా హృదయపు గిడ్డంగుల్లో దింపిపోతారు…..
నీ కళ్ళు నిజంగా అయస్కాంతాలే,
కావాలంటే పైన చూడు
కనుబొమ్మలు రజనులా అతుక్కున్నాయ్…
నీ చిలిపి కళ్ళు లిఖించే
చూపుల వాక్యాలకు నేనో పులుస్టాపుని
అవి నా దగ్గరే ఆగిపోతాయ్…..
వీధి మలుపులు
మన కొంటె చూపుల ప్రేమ వాక్యంలో కామాలై
సెకను పాటు విరామమిస్తాయ్ వాటికి…
నీ చెక్కిళ్ళ ఎడారిలో
ఆ సొట్ట ఒక ఒయాసిస్
నా ప్రాణాలక్కడే ఇరుక్కున్నాయ్…
నీ పెదాలు రెండు
నా పెదాల పాద స్పర్శకై నిరీక్షించే అహల్యలు…
నన్ను చూసి నవ్వినప్పుడు హెచ్చే గుండె చప్పుడు
టైపురైటింగు మిషనై వేవేల లేఖల్ని ముద్రిస్తుంది ఎదలో…..
– S యాది
