కొరోనా నేపథ్యంలో గత ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా లక్డౌన్ మూలంగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఒక్క రూపాయి కూడా సంపాదించలేక పోయాయి. అందువల్ల ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంనాటికి తిరిగి వ్యాపారంలో పుంజుకోవాలని పెద్ద థియేటర్ కంపెనీలన్నీ కృత నిశ్చయంతో ఉన్నాయి. వినియోగదారులు సినిమా హాళ్ళకు వెళ్లి సినిమా చూడటానికి అంతగా సుముఖంగా లేకపోవటంతో, దేశంలో అతిపెద్ద ముల్టీప్లెక్స్ థియేటర్లయిన పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ మరియు కార్నివాల్ సినిమాస్ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి ఒక కొత్త ఆలోచనే, డ్రైవ్ ఇన్ థియేటర్.
మామూలు థియేటర్లో వందలకొద్దీ వీక్షకులు ఒకే ప్రదేశంలో ఉండటం, సోషల్ డిస్టెన్స్ పాటించటానికి ఛాన్స్ లేకపోవటంవల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా నడపాలంటే సీట్లను పావు వంతు వరకూ తగ్గించాలి. అయితే, 25% సీట్లతో సినిమా హాళ్లు నడపటం కూడా చాలా కష్టం, నష్టదాయకం. డ్రైవ్-ఇన్ థియేటర్లో ఆ ప్రాబ్లెమ్ ఉండదు. అసలేంటి డ్రైవ్-ఇన్ సినిమా?
డ్రైవ్-ఇన్ థియేటర్ లేదా డ్రైవ్-ఇన్ సినిమా అనేది ఒక పెద్ద బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించబడే సినిమా . ఊళ్ళల్లో మన చిన్నప్పుడు పండగలప్పుడు రోడ్ మీద తెర కట్టి, ప్రొజెక్టర్ తో సినిమా వేసేవాళ్ళే, అలాంటిదన్నమాట. కాకపోతే, ఒక చిన్న తేడా, అదేంటంటే సినిమా చూసేది బెంచ్ మీదనో, కుర్చీలో కూర్చునో కాదు, పార్క్ చేసిన కార్ నుండి, ఎవరి కార్లలో వాళ్లు కూర్చుని.
ఇలాంటి డ్రైవ్ ఇన్ థియేటర్లు పార్కింగ్ ప్లేస్ లలో ఏర్పాటు చేస్తారు. పార్క్ చేసిన కార్ల నుండి కనిపించే విధంగా ఒక పెద్ద సిల్వర్ స్క్రీన్ కడతారు, ఆడియో బ్లూ టూత్ ద్వారా కారులోని స్టీరియో సిస్టెంకి స్ట్రీమింగ్ చేస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కొన్ని బెంచిలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బెంచిలకే ఆడియో స్పీకర్ హెడ్డుఫోన్లు ఉంటాయి. వినటానికి ఈ ఆలోచన కొత్తదిలా ఉన్నా, ఇది మరీ అంత కొత్తదేం కాదు. మొదటి డ్రైవ్-ఇన్ థియేటర్ని న్యూజెర్సీలో 1933లోనే ఓపెన్ చేసారు. కరోనా వల్ల మారిన పరిస్థితుల్లో ఇది వర్కవుట్ అవ్వచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు భావిస్తున్నాయి.
ఒక డ్రైవ్ ఇన్ సినిమా కట్టడానికి స్థల పరిమాణాన్ని బట్టి 3 నుండి 5 కోట్ల వరకు అవుతుంది. సిటీ లోపల నిర్మించిన థియేటర్లకయితే ఆ పెట్టుబడి ₹ 8 కోట్ల వరకు కూడా ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో కొన్ని చోట్ల డ్రైవ్ ఇన్ సినిమాలు ఉన్నాయి. అవి – అహ్మదాబాద్‌లోని సన్‌సెట్ డ్రైవ్-ఇన్-సినిమా, చెన్నైలోని ప్రార్థనా బీచ్ డ్రైవ్-ఇన్-థియేటర్, బెంగళూరులోని అండర్ ది స్టార్స్ , వైజాగ్గు ఎయిర్పోర్ట్ దగ్గరలో STBL డ్రైవ్-ఇన్ సినిమా, ఢిల్లీలో గుర్గావ్ టాకీస్ కొన్ని డ్రైవ్-ఇన్ సినిమాలు. అయితే ఇవి ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో డ్రైవ్ ఇన్ సినిమా సేఫ్ గా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు వస్తారేమో చూడాలి.