ఉలిదెబ్బలు తింటే గానీ శిల శిల్పంలా మారదు. వెండితెర వినీలాకాశంలో ఎందరో సగం మెరిసి తెరమరుగైపోయిన తారలు వున్నారు. కష్టానికి మారుపేరుగా నిలిచి అగ్రస్థానంలో స్థిరంగా నిలబడిన యోధులు కూడా ఉన్నారు. అందులో అగ్రతాంబూలం చిరంజీవికే ఇవ్వొచ్చు. ఆయన సినీ జీవన ప్రయాణంలో ఎదగని ఎత్తు లేదు దిగని లోతులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. అప్పటికే ఉన్న అగ్రతారాగణాన్ని సైతం పక్కకు నెట్టి తనదైన ముద్రతో ఆబాలగోపాలం మనసులో చోటు సంపాదించుకున్నాడు.
ఎదిగిన కొద్దీ ఒదిగే సమున్నత గుణాన్ని అలవర్చుకున్న ఈ శ్రమజీవి తెలుగు చిత్ర కళామతల్లి ముద్దుబిడ్డగా ఖ్యాతినార్జించాడు. ఇప్పటి హీరోల్లో ఒకటి రెండు హిట్లు రాగానే పొంగిపోవడం, మళ్లీ పరాజయం ఎదురుకాగానే కుంగిపోవడం చూస్తూనే ఉన్నాం. పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ విజయాల బాట పట్టిన నిత్య శ్రామికుడు చిరంజీవి.
నటులకి ఉండాల్సిన సామాజిక బాధ్యతని గుర్తించిన ఆయన తన ఆశేషమైన అభిమానులని సేవా మార్గం వైపు మళ్లించారు. రక్త దానం నేత్ర దానంపై ప్రజల్లో అవగాహన కల్గించి ఎందరో ప్రాణాలు కాపాడిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. అలుపెరుగని తన ప్రయాణంలో ఆయన అందరివాడిగా, ఆత్మీయుడిగా ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికులకు అన్నదాతగా అందరి మన్ననలు పొందుతున్నారు.
తెలుగు సినీపరిశ్రమ శకంలో చిరంజీవి రాక కి ముందు చిరంజీవి వచ్చిన తర్వాత అని విభజించక తప్పని పరిస్థితి. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల సందడి అప్పుడే అంబరాన్ని అంటుతున్నట్టే ఉంది.
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే శ్రమజీవికి, పుణ్యజీవికి, ధన్యజీవికి ట్రెండ్ ఆంధ్ర తరపున హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.