Geethanjali Movie : మణిరత్నం దర్శకత్వంలో 1989లో విడుదలైన ‘గీతాంజలి’ మూవీ తెలుగులో ఒక ఆణిముత్యంగా నిలిచింది. అంతవరకూ కవిత్వాన్ని చదవడమే జనానికి తెలుసు. నాగార్జున, గిరిజల నటన, లయరాజు ఇళయరాజు స్వరాల సంపద పొదువుకున్న వేటూరి పదాలు అందమైన గీతకావ్యాలు కాగా ఛాయాగ్రాహకునికి చిక్కిన ఊటీ ఆందాలు మణిరత్నం దార్శనిక దర్పణంలో ద్విగిణీకృతమైన దృశ్యాలు వెరసి గీతాంజలిని దృశ్య కావ్యాంగా మార్చేశాయి.
నాగార్జున ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ చేశారు. అలా చేయడం ఆ రోజుల్లో ఒక సాహసం అని చెప్పాలి. ఇక హీరోయిన్ కోసం సాగిన అన్వేషణలో గిరిజ ఈ సినిమా కోసమే పుట్టిందనట్టుగా సరిపోయింది. ఆ తర్వాత ఆమె పెద్దగా నటించకపోయినా గిరిజకు తెలుగునాట ఇప్పటికీ ప్రేక్షకాదరణ ఉందంటే దానికి గీతాంజలే కారణం ఈ సినిమా 1989 మే 19వ తేదీన విడుదలైంది.
కథ వెనుక మథనం :
తాను ఒక కథను తయారు చేసుకుని ఆ కథలోని పాత్రలను బట్టే ఆయన నటీనటులను ఎంచుకుంటూ ఉంటారు మణిరత్నం. ఇందులోని నాయకుడి పాత్రకి నాగార్జునను తీసుకున్నారు. మణిరత్నం వంటి దర్శకుడు చెప్పడంతో నాగార్జున కాదనలేకపోయాడు. ఇక ఫారిన్ నుంచి సెలవులకి ఇండియా వచ్చిన ‘గిరిజ’ అనుకోకుండా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
మణిరత్నం, సుహాసినిల పెళ్లి వేడుకలో హాజరైన క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబంతో వచ్చిన ఓ అమ్మాయి బావుందని మణిరత్నంకు అనిపించడంతో ఆమెను సంప్రదించి ఓకే చేయించుకున్నారు. ఆమె హీరోయిన్ గిరిజ. తనకేమో తెలుగు రాదు. అందుకని సీనియర్ అసోసియేట్ డైరెక్టర్‌తో డైలాగ్స్ పలకడంలో ట్రైనింగ్ ఇప్పించారు మణిరత్నం. ఆమె పాత్రకు తెలుగులో మరో నటితో డబ్బింగ్ చెప్పించారు మణిరత్నం. ఆ నటి ఎవరో కాదు రోహిణి. నటుడు రఘువరన్ సతీమణి అయినా రోహిణి.
బయ్యర్లు అంచనాలను తలక్రిందులు చేసి కాసుల వర్షాని కురిపించి :
ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోని ఒక క్లాసిక్ గానే మిగిలిపోయింది. ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేశారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ చనిపోతారా? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా? ఇలాంటి క్లైమాక్స్ ను అంగీకరిస్తారా? అని ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నిర్మాత సీఎల్ నరసారెడ్డి ఈ సినిమాను స్వయంగా విడుదల చేశారు. 4 వారాల పాటు థియేటర్లలోనే ఉంచి చూశారు.
ఆయన ఆశించినట్టుగానే 4వ వారం నుంచి జనంలో కదలిక మొదలైంది. ఈ సినిమాను గురించి మాట్లాడుకోవటం. థియేటర్ల బాటపట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా టిక్కెట్లు దొరకడం కష్టమైపోయింది. ఈ సినిమాలోని ప్రతి పాట హిట్.. ప్రతి దృశ్యం అద్భుతం అన్నారు. ఈ సినిమాకి ఇదే సరైన క్లైమాక్స్ అని ఒప్పుకున్నారు. మణిరత్నం సినిమాల్లో ఇది మణిపూస అన్నారు. ఇళయరాజా చేసిన గొప్ప ఆల్బమ్స్ లో ఇది ఒకటి అని చెప్పుకున్నారు.
గీతాంజలి డ్రెస్’ లు :
ఈ సినిమాలో గిరిజ ధరించిన డ్రెస్ లు పాపులర్ అయ్యాయి. ‘గీతాంజలి డ్రెస్’ లు పేరుతో మార్కెట్లోకి వచ్చాయి. సాధారణంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే ఆ వెంటనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతుంటారు. కానీ గిరిజ మాత్రం ఆ తరువాత సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపకుండా తిరిగి విదేశాలకి వెళ్లిపోయింది.
గీతాంజలి ఒక రియల్ కేరెక్టర్ :
మణిరత్నం ఈ సినిమా తీయడానికి ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల గీతాంజలి అనే అమ్మాయి కారణం. కేన్సర్‌తో బాధపడుతున్న ఆ అమ్మాయి తన భావాలన్నీ డైరీలా రాసి పుస్తకంగా వెలువరించింది. దానిని చదివిన మణిరత్నం బాగా చలించిపోయారు. అప్పుడు తన సినిమాకు గీతాంజలి అనే పేరు పెట్టారు. ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారని అంటారు. సినిమాను దాదాపు ఊటీ నేపథ్యంలో తెరకెక్కించారు.
మరికొన్ని నెలలకి మించి తాము బ్రతకమని తెలిసిన ఇద్దరు ప్రేమికుల కథ ఇది. తనదైన శైలిలో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. గీతాంజలి సినిమాలో గీతాంజలిగా చేసిన గిరిజ ఒట్టి అల్లరి పిల్ల. చనిపోతానని తెలిసినా మృత్యువు ఎదురైతే దానినీ అల్లరి పెడదామని చూసే పిల్ల. ప్రకాష్ పాత్ర పోషించిన నాగార్జున కూడా కొంటె పిల్లాడేకాని హఠాత్తుగా మృత్యువు తనని కావలించుకోవడానికి వస్తుందని తెలిసే సరికి కొంచెం డిస్టర్బ్ అవుతాడు. ఘనీభవించి ఉంటే ఈ అమ్మాయి ప్రవహిస్తూ ఉంది.
తను కన్నీరు కారుస్తుంటే ఈ అమ్మాయి చిన్నచిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందబాష్పాలు రాలుస్తోంది. ఈ అమ్మాయికి ప్రకృతిలో ప్రతిక్షణం ఒక జన్మ. అందమైన జన్మ. ఆ యువకుడికి ధైర్యం వచ్చింది. జీవితం పట్ల అవగాహన ఏర్పడింది. రేపటి చింత ఇవాళ ఎందుకు? ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుదాం అని ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయీ అతడితో మనస్ఫూర్తిగా ప్రేమలో పడింది. మృత్యువు దాకా వెళ్లి తిరిగి వచ్చాక అతడి కోసం వెతుకుతుంది. ఆమె నుంచి దూరంగా పోదామనుకున్న అతడు కూడా ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు.
‘ఎంతకాలం బతుకుతారో తెలియదు. కాని బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు’ అని స్క్రీన్ మీద పడటంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ఆరు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఒంటరి బాటసారి జంటకు చేరగా చిరు చేపల కనుపాప అల్లరి పాపాయిగా మారి పోగా వయస్సులో వసంతమె ఉషస్సులా జ్వలిస్తే వారి ఇరువురి మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక జాలి మాటలు మాసిపోని ఆశలు అయినా వాటిని లెక్క చేయక జగతికే..
అతిధులై జననమందిన ప్రేమ జంట ఆ నయన శృతులకు హృదయలయలు ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని మరింత చేరువ చేశాయి. గనాలు భువనాలు ప్రేమతో వెలిగించేసి మరణాన్ని ప్రేమతో పిలిచి నిధికన్నా ఎదమిన్న ప్రేమకే జయం ప్రేమదే జయం ఆర్థిక కష్టమో, ఆరోగ్య కష్టమో, జీవిత కష్టమో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక్క చిరునవ్వుతో దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడితే జీవితం సులువవుతుందని చెప్పే ఈ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులకు.. నైరాశ్యంలో ఉన్నవారికి చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే నేటి యువతకు స్ఫూర్తి..