IlaiyaRaaja Birthday Special : ఆయన పాట వినడం కొన్ని నిమిషాల పనికాదు అదో అనుభవం.. అదో అనుభూతి. గొపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్నముద్దల మాధుర్యాని చవిచూపింది. ఏ పాట ముందు వినాలన్నది సగటు సినీసంగీత ప్రియునికి సంక్లిష్టత శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీత పరికరాలపై పలికించి వినూత్న శైలిలో రాగమాలికగా మార్చడం అతని ఆభిలాష. కొత్తకొత్తగా స్వరాలని కూర్చడంలో కూలీ నెం 1. రాజాధిరాజాధి రాజ అంటూ కుర్రకారుచే పూజలందుకున్న స్వర్ణజ్ఞాని ఇళయరాజా. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని.
చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడులోని తేని జిల్లా పన్నియపురంలో జన్మించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. 1970 కి ముందు శ్రోతలు మధురమైన సంగీతాన్ని విన్నారు. 1970 తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. కమర్షియల్ పాటల ప్రాధాన్యత పెరిగింది. ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన ప్రభావాన్ని చాటుకున్నాడు. మెలోడీ సాంగ్ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి.
మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ అందించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గీతాంజలి’ పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. కమల్‌హాసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా సంగీత ప్రజ్ఞకి గీటురాళ్ళు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి ’సింఫనీ’ ని కంపోజ్ చేసారు. ఆసియా ఖండం లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన చిత్రపరిశ్రమలో చేసిన సేవలకు గాను 2010 లో భారత ప్రభుత్వం ’పద్మభూషణ్’.. 2018 లో పద్మ విభూషణ్‌తో ఆయన్ని గౌరవించింది. సంగీతవనంలో పరిమళించే స్వరసుమాలు రాగయోగంతో సమ్మోహన బంధమేస్తాయి. వేవేల వర్ణాలని సంగీత కావ్యాలుగా మార్చేస్తాయి.
అందుకే ప్రతి దినం ఆ వర్ణాలని వినాలని శ్రోతల కోరిక. హేమంత వేళల్లో లేమంచు పందిట్లో హృదయ వీణ ఊయలలూగుతుంది. నిన్న కాదు.. నేడు కాదు ఎప్పుడు నే రాజ అన్న ధీమాతో సాహసం నాపధం, రాజసం నారధం అని సాగింది. వలపు నర్తనం ఆడుతుంది. చిలిపి కీర్తనం పాడుతుంది. ఈ జగంలో జగడ జగడ జగడం చేసేస్తుంది. జగదానందకారకమైన స్వర మధురిమలను, సరాగాలుగా సంగీత వశీకరణ మంత్రాలుగా ఆభిమంత్రిస్తే , కలయా నిజమా అన్న సంభ్రమానికి గురి చేస్తాయి. ఆ స్వరాలు సంగీత సాగరసంగమంలో ఆణిముత్యాలు ఆ సురాగాలు మనసు పలికే మౌన గీతాలు మమత లొలికే స్వాతిముత్యాలు.
ఇందువదన, కుందరదన, మందగమన, మధుర వచనాలతో ఛాలెంజ్ చేసి స్వరపరచిన బాణీలెన్నో అ రాగ సాగరంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోతాయి. సీతాకోకచిలుకల పందిరిలో సేదతీరుతాయి. బంతి, చేమంతి మద్దాడినట్టు మల్లెచెండు నవ్వినట్లు మయాజాలం చేస్తాయి. తేనెకన్న తియ్యని భాషకు సప్తస్వరాల సొగస్సును అద్ది జాబిల్లికోసం ఆకాశమల్లెలను పరుస్తాయి. ఆ సంగీతావేశమంతా మధురాలాపనగా మారి వటపత్రశాయికి వరహాల లాలి పాటను పాడతాయి, సాయిచరణాన్ని శరణాగతి చేస్తాయి. చిలకల కొలికిలో కీరవాణి రాగమై ప్రతిధ్వనిస్తాయి. మనస్సుకు రెక్కలు కట్టి ఎక్కడికో తీసుకుపోతాయి. మధుర మురళి హృదయ రవళి మదలో మౌనంగా మోహనరాగాన్ని హమ్ చేస్తుంది.
గోపిలోల నీపాలపడామంటూ ప్రాధేయ పడుతుంది. వేవేల వర్ణాలను సంగీత కావ్యాలుగా మార్చేస్తుంది. స్వరసరాగ సంకీర్తన సింధుభైరవిగా వినిపిస్తుంది. మంచుకురిసే వేళ్ళలో మల్లెలు పూయిస్తాయి, అభినందనలు అందుకుంటాయి. ఆ సరిగమ పదనిస గుసగుస తెల్లచీరకు తకధిమి తపనలను నేర్పిస్తాయి. బృందావన సోయగాన్ని చూపిస్తాయి. కర్పూరవీణను కరిగిస్తాయి. సుమం ప్రతి సుమం వనం ప్రతి వనంవనం జగం అణు అణువులో భానోదయాన చంద్రోదయాన్ని అవిష్కరిస్తాయి. తరలిరాని వసంతాన్ని సొంతంచేస్తాయి. లలితప్రియకమలాన్ని వికసింపజేస్తాయి. కొత్తగావచ్చిన రెక్కలతో ఎగిరే గువ్వ అనందాన్ని అనందభైరవిగా అందిస్తాయి.
ప్రేమకు ప్రతిరూపమై నిలుస్తాయి. ‘ఎక్, దో, తీన్ సఖీప్రియ మైనె తుంకో ప్యార్ కియా’ అన్న ప్రియుడితో సరసాలుచాలు శ్రీవారు వేళ్ళకాదు అని హెచ్చరిస్తాయి. ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో కవింతల్లో తుళ్ళింతల్లో ఎన్నేన్ని కావ్యాలో వ్రాసేస్తాయి. చుక్కల్ని సైతం తెంచుకొచ్చి ప్రేక్షకులను మెప్పిస్తాయి. మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు యదలో శుభలేఖను రాస్తాయి. ఓహో లైల ఓ చారుశీల కోపమేల అని లాలిస్తాయి. అందాలలో మహోదయాన్ని సృస్టిస్తాయి. బలపంపట్టి భామ వడిలో ఓనమాలు దిద్దిస్తాయి. జాణవులే నెరజాణవులే అంటూ మధ్య సంతకాలు చేస్తాయి. ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమా అందాలు అని ఆరాతీస్తాయి.
శ్రావ్యమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించి ఇదే రాజయోగం అదే మోహబంధం అన్న భావాన్ని కల్పించాడు. పాశ్చాత్య సంగీతబాణీలను శాస్రీయ సంగీతంతో మేళవించిన ప్రతీసారి సంచలనమే ఆ బాణీలు చిలకమ్మను చిటికేయిస్తుంది. వయ్యారి గోదారికి ఒళ్ళంత కలవరాన్ని తెస్తుంది. బృందావిహారంలో రాధమ్మను పలకరిస్తుంది. మౌనంగానే రేయిని మరపురానిదిగా మార్చేస్తుంది. సంఘ హితమే సంగీతమని స్వరయాగం చేసిన మహర్షి. సినీసంగీతాన్ని రాగరంజితం చేసిన సంగీతభూషణుడు వినయ విభూషణుడు ఇళయరాజా అభిమానుల హృదయలయరాజు సినీసంగీతపు ఫ్రభంజనం.. నీకు అభివందనం.. జన్మదినోత్సవ శుభాకాంక్షలు…