Jr NTR Birthday Special : నందమూరి వంశలోపుట్టి.. నటసార్వభౌముని వద్ద పెరిగి సినీమావి నీడలో తాతయ్యతో కలిసి యమహో నీ నటన అనిపించావు. నువ్వు విజిలేస్తే రికార్డులు, తొడకొడితే బాక్సాఫీస్ బద్దలవుతుంది. రాజమౌళి నిన్ను స్టూడెంట్ నంబర్ వన్ గా తీర్చిదిద్దితే నునుగు మీసాలతో కళ్ళల్లో కసిని కండల్లో పసని చూపించిన సింహాద్రివే.. వేట కత్తికి మీసం పెడితే నీ లానే ఉంటాది.. నువ్వు విజిలేస్తే అలజడి రేపిన రికార్డుల మోత ఇప్పటికీ వినపడుతోంది. కొమురం భీముడిగా నిన్ను నువ్వు మలచుకున్న తీరు చూస్తే గుండె ఉప్పోగుతుంది. నీ వదనంపై చొదే చిరునవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి కూడ అప్పు ఆడిగేలా చేస్తుంది. అది ఈ ఆంధ్రావాల పవర్.
ఏగూటి చిలక ఆగూటి పలుకే పలుకుతుంది. నటనను నఖశిఖ పర్యంతం ప్రసుస్పుటంగా ప్రదర్శించగల నందమూరి వంశం నుంచి ఉద్భవించిన నటవారసుడు, తాతయ్య ఆంగిక వాచక అభినయ సూత్రాని తారకమంత్రంగా జపించి తాతకు తగ్గ మనవడిగా మన్నన పొందినవాడు. నందమూరి తారక రామారావు (Jr NTR) మే 20, 1983 న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు.
తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. జూనియర్ ఎ న్.టి.ఆర్. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “బాల రామాయణం” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రలో ఒదిగిపోయాడు. నీలమేఘ శ్యాముడిగా అంత చిన్నవయసులోనే అద్భుతంగా నటించాడు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఏలుకో బాలకా రాసిచ్చా ఈ సినిమా ఇలాఖా అన్నచందంగా బాల్యం నుంచి తాతయ్య పాఠశాలలో నటనను ఆభ్యసించి నిన్ను చూడాలనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత స్టూడెంట్ నెం 1 మూవీతో మెప్పించాడు. అల్లరి రాముడిగా అలరించాడు.
ఏ పాత్రలోనైనా సరే సులువుగా పరకాయ ప్రవేశం చేయగల నేర్పు, తెగువ కలిగిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన కామెడీ అదుర్స్. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే క్రమంలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంతో, ఎన్టీఆర్ పోటాపోటీగా నటించాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “యమదొంగ” చిత్రంలో “యంగ్ యముడి” పాత్రలో ఎన్టీఆర్ నటన యమహో.. అనిపించింది. ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. సుదీర్ఘమైన పదాలు గల డైలగ్ ను అనర్గళంగా చెప్పించి ప్రేక్షకులను మెప్పించడంలో తాతకు ఏమాత్రం తీసిపోడని ఋజువుచేసింది. సిని”మా” అవార్డులలోనూ, ఫిలిమ్ ఫేర్ అవార్డులోనూ తారక్‌కు “ఉత్తమ కథానాయకుడు” అవార్డు లభించింది.
కుటుంబ కథాచిత్రంగా బృదావనం అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్‍షా, రామయ్యా వస్తావయ్యా, రభస, టెంపర్ చిత్రాలలో విలక్షణమైన కధాంశాలతో సాగిన ప్రాతలకు తగిన న్యాయం చేశాడు. “సింహాద్రి” సినిమాతో విజయ గర్జన చేసిన సింహం. రాఖీ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ నట ప్రస్దానంలో మరో మైలురాయి. వరకట్న బాధితురాలైన తన చెల్లెలికి జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదని భావిస్తాడు. అందుకే సమాజంలో ఆడపిల్లల మాన, ప్రాణ సంరక్షణ కోసం వారికి అండగా నిలబడతాడు. ఈ క్రమంలో మగువల కన్నీళ్ళకు కారణమయ్యే ముష్కరుల ఆట కట్టించి మహిళా ప్రేక్షకులకు చేరువైనాడు.
“టెంపర్” “నాన్నకు ప్రేమతో” కమర్షియల్ హిరోగా జూనియర్ ఎన్టీఆర్ ను సుస్దిరపరిచాయి. జై లవకుశ (త్రిపాత్రాభినయం) అయన నటనలోని మరో పర్శ్వం. జనతా గ్యారేజ్ వాస్తు ఆయనకు కలిసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటన పటిమను ప్రపంచానికి చాటిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. భేషజాలకు దూరంగా మల్టీస్టార్ సినిమాలో నటించడం తాతయ్య, నాన్న గారి ఆడుగు జాడలోనే తన ప్రస్దానాన్ని కొనసాగించడం ముదావహం. సినీ పరిశ్రమలో ఆరోగ్యకర పరిణామం.
కారు ప్రమాదంలో త్రండిని పోగొట్టుకున్న కొడుకుగా, భాధ్యత గల పౌరుడిగా హైద్రాబాద్ పోలీస్ శాఖతో కలిసి రోడ్డుభద్రతపై అనేకమార్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు. అనేక స్వఛ్ఛంద, సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుండి చేయూతనిస్తాడు. సహాయం చేస్తూ.. సినిమా ఇలాఖాను ఏలుకునే కథానాయకునిగా మరిన్ని విజయాలు అందుకోవాలి. ముందుగా జన్మ దినోత్సవ శుభాకాంక్షలు జూనియర్..