Karnataka CM Siddaramaiah : సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను డిసైడ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేసులో ఉన్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పాటు.. కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయించారు. మూడు రోజులుగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిద్ధరామయ్యకు ఉన్న అనుభవం, సీనియార్టీని పరిగణలోకి తీసుకుని.. డీకే శివకుమార్ ను బుజ్జగించినట్లు తెలుస్తుంది.
డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానే కొనసాగాలని.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.
• ఆయనది వ్యసాయకుటుంబం. 1948 ఆగస్టు 12న మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో సిద్ధరామయ్య జన్మించారు.
• పదేళ్ళ వయసు వచ్చే వరకు ఆయన బడికి పోలేదని చెబుతారు. పొలం పనుల్లో సాయం చేస్తూ తల్లిదంద్రులకు సాయం చేసేవారట ఆ తరువాత ఆయన డిగ్రీ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు.
• 75 ఏళ్ల సిద్ధరామయ్యకు రాజకీయాల్లో 45ఏళ్ల అనుభవం ఉంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న రెండో వ్యక్తి కూడా ఆయనే..
సిద్ధరామయ్యకు కలిసొచ్చిన అంశాలు..
• అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రధాన కారణం.
• 135 ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్ లో స్పష్టమైనట్లు తెలిసింది.
• ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది.
• సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు.
• అవినీతి రహిత పాలన, మాస్ లీడర్ గానూ సిద్దరామయ్యకు పేరుంది.
• సిద్ధరామయ్య అయితే రాబోయేకాలంలో పార్టీలో వర్గవిబేధాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది.
ఆధిష్టానాన్ని భయపెట్టిన డుతున్న కేసుల బూచి
శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ గెలుపులో శివ కుమార్ పాత్ర ఎక్కువ అయినా సరే, కేసులను బూచిగా చూపిస్తూ ఆయన్ను నిలువరించి, సిద్ధకు సీఎం పీఠం కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ కనిపిస్తోంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కాంగ్రెస్ సాధించడానికి శివకుమార్ చేసిన కష్టం అందరికీ తెలుసు. గతంలోని 78 సీట్లను 135కు చేర్చడానికి రాహుల్ పాదయాత్ర మొత్తం దక్షిణ భారతదేశంలో సాగడానికి శివకుమార్ చాలా శ్రమించారు.
ఫలితం సాధించారు కానీ ఇప్పుడు ఆయన్ను సీఎం పీఠానికి దూరం చేసేందుకు అవకాశాలూ అన్నే ఉన్నాయి. శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. నిన్నటి వరకూ కర్ణాటక డిజిపిగా ఉన్న ప్రవీణ్ సూద్ ను ఎకాఎకిన సీబీఐ చీఫ్ గా నియమించిన కేంద్రం ఇప్పుడు శివకుమార్ విషయంలో దూకుడు ప్రదర్శించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలన్న బిజెపి వ్యూహం. తెలంగాణ ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు కీలక పార్టీ బాధ్యతలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇక తెలంగాణపై దృష్టిసారించనుంది.
మరికొన్ని మాసాల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ బలం పుంచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఢీలాపడుతున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికార పగ్గాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించిన వ్యూహాలకు కాంగ్రెస్ పెద్దలు పదునుపెడుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధించే లక్ష్యంతో డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించి.. డీకే శివకుమార్ సేవలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. అదే సమయంలో బీజేపీ బలం పుంజుకుంటోంది. అయితే తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే డీకే శివకుమార్ వంటి నాయకుడి సేవలు ప్రస్తుతం ఇక్కడ పార్టీ అవసరమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ ధీటైన పోటీ ఇచ్చే అవకాశముందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు కీలక పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో శివకుమార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఎదుర్కోవడంతో పాటు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ను అడ్డుకోవాలంటే డీకే లాంటి సమర్థవంతమైన నాయకుడి సేవలు అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ చేసిన ప్రచార వ్యూహాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. ఈ వ్యూహాలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా అవసరమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ – బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ సాయపడగలరని చెబుతున్నారు.
ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మే 18వ తేదీన బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఓ క్లారిటీ రావటంతో.. కర్ణాటకలో రాజకీయ టెన్షన్ కు తెర పడుతుందా లేదా కర్ణాటకంలో మరో రసవత్తర అంకం ప్రారంభమౌతుందా డీకే వర్గీయులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి..