Kiran Abbavaram : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరు నిలదొక్కుకోలేరు. టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇంతకు ముందు విడుదలైనవి కొన్ని చిత్రాలే అయినా.. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు నిర్మించేందుకు క్యూ కడుతున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ మంచి హిట్ అందుకున్నాడు.
అయితే మూడో చిత్రం ‘సెబాస్టియన్’ నిరాశ పరిచినా… అతని నాలుగో సినిమా ‘సమ్మతమే’ కి మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ ఫర్వాలేదు అనిపించినా, మీటర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్లాప్ లు, యావరేజ్ మూవీస్ తో నెట్టుకొస్తున్నప్పటికీ ఈ కుర్రహీరోని వెతుక్కుంటూ అవకాశాలు రావడం విశేషం. అయితే గత కొన్ని చిత్రాలలో కిరణ్ ఎంచుకున్న కథలు రాంగ్ టైమింగ్ అనిపించాయి.
అయితే తాజాగా రూల్స్ రంజన్ (Rules Ranjan) తో మళ్ళీ తనకు అలవాటైన ట్రాక్ లోకి వస్తున్నాడనిపిస్తోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో కిరణ్ కు జోడిగా నేహా శెట్టి (Neha Shetty) నటిస్తుంది. ఎ.యం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ నుంచి ‘నాలో నేనే లేను’ అనే పాట రిలీజ్ చేశారు మేకర్స్. కిరణ్ కి ఇమేజ్ కి సరిపోయే కథని ఈ పాట చూస్తే అర్ధమౌతుంది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జోడీ బావుంది. అలాగే ట్యూన్, లిరిక్స్ క్యాచిగా వున్నాయి. ఈ మధ్య కిరణ్ తన ఇమేజ్, కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేశాడు. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ రూల్స్ రంజన్ మాత్రం కిరణ్ ఇమేజ్ కి తగ్గ కంటెంట్ ఉన్న చిత్రం అని అనిపిస్తోంది. చూడాలి రూల్స్ రంజన్ తోనైనా కిరణ్ హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో..