Rain Names : వర్షం పడుతుంటే ఎంతో ఆనందంగా ఆ నీళ్లలో ఆడుతూ ఉంటాము. కానీ వర్షం అనేక రకాలుగా పడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. అలా పడే వర్షానికి ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. అలా వర్షానికి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. వర్షాన్నీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 పేర్లతో పిలుస్తారు. నిజంగా ఇది ఎవరు ఊహించి ఉండరు.ఇంకా ఆలస్యం ఎందుకు ఆ 25 పేర్లు ఏంటో వెంటనే తెలుసుకుందాం రండీ..
★మీసర వర్షం : ఈ వర్షం మృగశిర కార్తెలు పడుతుంది.
★దుబ్బురు వర్షం : తుంపర్లుగా కురిసే వర్షాన్ని దుబ్బుర వర్షం అంటారు.
★బట్టదడుపు వర్షం : ఒంటి మీద ఉన్న బట్టలు తడిసిపోయేంతగా వర్షం పడితే దాన్ని బట్టతడుపు వర్షం అంటారు.
★సూరునీల్ల వర్షం : వర్షానికి ఇంటి చురు నుండి దారపడేలా నీళ్లు కారితే అటువంటి వర్షాన్ని సూరు నీళ్ల వర్షం అంటారు.
★గాంధారి వర్షం : వర్షం పడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న చెట్లు కానీ,మిగతా ఏమీ కనిపించకుండా పడే వర్షాన్ని గాంధారి వర్షం అంటారు.
★మాపుసారి వర్షం : సాయంత్రం సమయంలో వచ్చే వర్షాన్ని మాపు సారి వర్షం అంటారు.
★సానిపి వర్షం : వాకిలి పై అలుకు జల్లినట్టుగా కురిసే వర్షాన్ని సానిపి వర్షం అంటారు.
★తెప్పె వర్షం : అంతట కాకుండా ఒకే ప్రదేశంలో ఒక మేఘం నుండి పడే వర్షాన్ని తెప్పే వర్షం అంటారు.
★సాలు వర్షం : రైతులు వ్యవసాయం మొదలుపెట్టడానికి ముందు నాగలిసాలుకు సరిపడా పడే వర్షాన్ని సాలువర్షం అంటారు.
★ఇరువాలు వర్షం : వ్యవసాయంలో రెండుసాల్లకు సరిపోయినంత, విత్తనాలు వేసుకోవడానికి అనువుగా పడే వర్షాన్ని ఇరువాలు వర్షం అంటారు.
★మడికట్టు వర్షం : బురద పొలాన్ని దున్నుకోవడానికి అవసరమైనంత పడే వర్షాన్ని మడికట్టు వర్షం అంటారు.
★ముంతపోత వర్షం : ముంత తోటి నీళ్లు తోడి పోసే అంతగా పడే వర్షాన్ని ముంతపోతా వర్షం అంటారు.
★కుండపోత వర్షం : కుండతో కుమ్మరించే అంతగా ఏకధాటిగా పడే వర్షాన్ని కుండపోత వర్షం అంటారు.
★ముసురు వర్షం : వరుసగా రోజుల తరబడి ఆపకుండా ముసురు పట్టినట్టుగా పడే వర్షాన్ని ముసురు వర్షం అంటారు.
★దరోదరి వర్షం : అపకుండా కురిసే వర్షాన్ని దరోదని వాన అంటారు.
★బొయ్యబొయ్యగొట్టే వర్షం : గాలి దుమారంతో కురిసే వర్షాన్ని బొయ్యబొయ్యగొట్టే వర్షం అంటారు.
★రాళ్ల వర్షం : అకాలంగా రాళ్లతో పాటు కురిసే వర్షాన్ని వడగండ్ల వర్షం అంటారు.
★కప్పదాటు వర్షం : అన్ని చోట్ల కాకుండా ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా కురిసే వర్షాన్ని కప్పదాటు వర్షం.
★తప్పడతప్పడ వర్షం : ఒక్కొక్కసారి పెద్దగా తర్వాత మామూలుగా చినుకులుగా పడే వర్షాన్ని తప్పడతప్పడ వర్షం అంటారు.
★దొంగ వర్షం : రాత్రంతా కురిసి తెల్లారేలోపు తగ్గిపోయే వర్షాన్ని దొంగవర్షం అంటారు.
★కోపులునిండే వర్షం : రోడ్డు పక్కన గుంతలు నిండేలాగా వర్షం కురిస్తే దానిని కోపులు నిండే వర్షం అంటారు.
★ఏక్దార వర్షం : ఏకధారగా కురిసే వర్షాన్ని ఏక్ధార వర్షం అంటారు.
★మొదటి వర్షం : రైతులు విత్తనాలు నాటిన తరువాత విత్తనాలకు సరిపడా బలన్నిచ్చే వర్షాన్ని మొదటివర్షం అంటారు.
★సాలేటి వర్షం : భూమి తడిసేంతగా భారీగా వర్షాలు పడితే వాటిని సాలేటి వర్షం అంటారు.
★సాలుపెట్టు వర్షం : పొలం దున్నడానికి సరిపోయేంతగా వర్షం కురిస్తే దానిని సాలు పెట్టి వర్షం అంటారు.