Varahi Vijaya Yatra : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో జనసేన పార్టీ (JSP) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వారాహి వాహనంలో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. వారాహి యాత్ర సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాలతో మమేకమతున్నారు. జనాదరణ పొందుతున్న జనవాణి ప్రతి నియోజకవర్గంలో పార్టీ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ప్రజా ఫిర్యాదులను స్వీకరించడం ఫిర్యాదుదారుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వపై ఒత్తిడి తేవడం, రైతులు మరియు ఇతర అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన దృష్టి పెట్టడం లాంటి చర్యలు జనసేన వైపు ప్రజలని ఆకర్షిస్తున్నాయని చెప్పాలి.
పదునెక్కిన ప్రసంగాలు..
పరిపాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని, నాయకులు బాధ్యతగా లేనప్పుడు కచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో నిర్ణయించుకోలేదని, ఈసారి అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుందని విశ్వాసం వ్యక్తం చేయడం వెనుక జనసేన పంథా మార్చనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజల అభిమానం వల్లే పార్టీని నడిపించగలగు తున్నామని ఈసారి ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో చూస్తామని ఆశించిన రీతిలో స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం మంచి పరిణామం. ఇది జనసేన సైనికులను ఉత్సాహాన్ని ఇచ్చే వ్యూహం.
అయితే పవన్ కల్యాణ వారాహి యాత్ర సాగుతున్న కొద్ది కొత్త సవాళ్ళను ఎదుర్కోవాలి. ఎన్నికలకు సన్నద్దం అవుతూనే అధికారపక్షంతో యుద్ద చెయ్యాలి కానీ పరిణితిని పక్కను పెట్టి అవేశంలో చేసే కొన్ని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం తప్ప ఫలితం శూన్యం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విధంగా జనసేన వ్యవహరించాలి. సకారాత్మక రీతిలో వ్యవహరించాలి వ్యక్తిగత దూషణలకు తావులేకుండా చూసుకోవాలి. ప్రసంగంలో పవర్ పెంచిన పవన్ పంథాను మార్చి ప్రజానాడిని పట్టుకోగలగాలి. పొత్తులపై దాగుడుమూతలు పార్టీకి నష్టం. అనుభవజ్ఞులైన వారివద్ద నుండి సలహాలు తీసుకుని హుందాతనంతో ఆవేశంతో కాక ఆలోచన రేకెత్తించే విధంగా సభలో మాట్లాడగలిగితే ఈసారి ఎన్నికల్లో జనసేన కీలక భూమిని పోషించగలదు.
జనసేన బలం, బలగం అంతా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే కాబట్టి అక్కడే ఉన్న సామాజిక వర్గాల మద్దతు కోసం అయా జిల్లాల్లో పర్యటనలకు ఎంచుకోవడం యాత్ర కొనసాగిస్తూ వృత్తిదారులు, రైతులు, కర్షకులు , కూలీలు, ఇలా వివిధ వర్గాల వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని కలిసేలా ప్రణాలిక రచిచడం అక్కడ జనసేనకు మద్దతు కూడగట్టడం తెలివైన ఎత్తుగడే అన్ని చెప్పాలి. జనసేన గెలిస్తే ప్రజలకేం చేస్తుంది?
అన్ని వర్గాలు మెచ్చేలా సామాజిక న్యాయం ఎలా చేస్తారు? అన్న అంశాలపై ఈ యాత్రలో స్పస్టత ఇవ్వాలి. ఈ అంశాలే యాత్ర విజయానికి కీలకం, జనసేన కూడా తన బలమేంటో గుర్తించి, తనకు పట్టున్న ప్రాంతంపైనే దృష్టి పెట్టడటం ఆ పార్టీకి శుభ పరిణామమే.
ఇక్కడ కేవలం మాట్లాడితే సరిపోదు. వారి మధ్య సఖ్యత తీసుకురావడానికి భరోసా ఇవ్వాలి. తమ పార్టీ అందరితో కలిసి ఉంటుందనే సామాజిక భావనను వారిలో పెంపొందించాలి. ఆయా వర్గాలకు తను ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలి. ప్రభుత్వ వ్యతిరేకత పై విమర్శలు సంధించటానికి అధికార వైఎస్సార్సీపీని తిట్టడానికే అయితే ఈ వారాహి యాత్ర వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. ప్రజలను ఆ కష్టాల నుండి గట్టెక్కించడానికి జనసేన దగ్గర ఎలాంటి ప్రణాళికలున్నాయి? వాటిని ఎలా అమలు చేస్తారనేదే ఈ యాత్ర లక్ష్యం కావాలి. జనసేన చెప్పుకుంటున్నట్టుగా ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం ఈ మూడు నినాదాలను ఎలా జోడిస్తారు? ఎలా ఈ మూడు లక్ష్యాలను సమతుల్యంలో నెరవేరుస్తారో పవన్ తన యాత్రలో ప్రజలకు వివరించాలి. టీడీపీ ప్రకటించిన మేని మేనిఫెస్టోని సైతం మార్చగల శక్తి సామర్థ్యాలు తమ పొత్తుకు ఉంటుందని జనసేనాని ప్రజల్లో నమ్మకం కలిగించాలి.
అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలను సూచిస్తే మంచిది. స్థానిక సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో అక్కడే వివరించాలి. దీనికోసం పవన్ కల్యాణ్ బృందం స్థానిక సమస్యలపై లోతుగా పరిశోధన చేసి సరైన పరిష్కారాలతో రోజువారి నివేదికలు అందిస్తూ ఓటర్ల మనసు గెలుచుకోగలిగితే యాత్ర లక్ష్యం నెరవేరి ‘వారాహి’ విజయవంతం అవుతుంది. ఈ యాత్ర ద్వారా పవన్ కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలి. తాను అందరి వాడినని పవన్ ఈ యాత్ర ద్వారా తెలియజేయాలి. తాను తాత్కాలిక రాజకీయ నాయకుడిని కాదనే గట్టి సందేశాన్ని పవన్ ఈసారి అందిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనహితం కోసం జనసేన ఏం చేస్తుందో చాటి చెప్పాలి. ఈ యాత్ర జనహితార్థం జరిగితేనే ‘జనసేనాని యాత్రకు జనం వస్తారు కానీ, ఓట్లుపడవు’ అనే ముద్ర చెరిగిపోతుంది. అప్పుడే జనసేన కల నిజమవుతుంది ఈ యాత్ర జనహిత యాత్రగా మారుతుంది.