Konidela Surekha : ఆయన లాగే కళ్యాణ్ బాబు.. చిరు, పవన్ ఆహారపు అలవాట్లపై సురేఖ వ్యాఖ్యలు
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అన్నదమ్ములైనప్పటికీ వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం ఇద్దరి గుణం ఒక్కటే. ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే తోచిన సహాయం చేస్తుంటారు మెగా బ్రదర్స్. కాకపోతే చిరంజీవి కాస్త సౌమ్యంగా ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమో ముక్కుసూటి వ్యక్తిత్వం.
చెడ్డ వారినైనా క్షమించే గుణంతో ఉంటారు చిరు. కానీ పవన్ మాత్రం మంచికి మంచి చెడుకి చెడు అన్నట్లుగా ఉంటారు. వైవిధ్యమైన వ్యవహార శైలి ఉన్న అన్నదమ్ములలో మరో పోలిక కూడా ఉందంటున్నారు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ. తాజాగా ఇంటర్వ్యూలో సురేఖ మాట్లాడుతూ చిరంజీవి గారి, కళ్యాణ్ బాబు ఇద్దరి ఆహారపు అలవాట్లు ఒకే విధంగా ఉంటాయని అన్నారు.
అయితే చిరు, పవన్ ఎప్పుడూ రుచికరమైన వంటకాలు కోరుకోరట. వాళ్ళిద్దరికీ పచ్చడి మెతుకులు ఉన్నా చాలు.. తృప్తిగా తినేస్తారు. అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేయరు. కానీ నాగబాబు వేరు.. తన భోజనంలో అన్ని రుచులు కోరుకుంటారు అని సురేఖ తెలిపారు.
తాను పెళ్లయ్యాకే వంటలు నేర్చుకున్నట్లు సురేఖ తెలిపారు. పెళ్లి తర్వాత ఒకరోజుఉప్మా చేస్తే ఉండలు ఉండలుగా సరిగా రాలేదు. మా మావయ్య ( చిరు తండ్రి) వెంకట్రావు గారికి వంటలు బాగా వచ్చు. ఆయన భోజన ప్రియులు. చాలా వంటలు ఆయన నుంచే నేర్చుకున్నా. మా అత్తగారి నుంచి కొన్ని వంటలు నేర్చుకున్నట్లు సురేఖ తెలిపారు.