Singer Chitra Birthday Special : పున్నాగ పూసంత నవ్వినట్టు.. సందేళ సంపంగి పరిమళం మనల్ని తాకినట్లు.. మలబారు తీరం నుంచి వీచిన మలయసమీరం ఆమె రాగం. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే గమ్మతైన గమకాలు జల్లుకి తనువు జల్లంత కవ్వింత కావాలల్సిందే, ఒళ్ళంత తుళ్ళింత రావాలల్సిందే ఈ స్వరహారాల కోకిలమ్మ పాటకి. “పాడలేను పల్లవైన భాషరాని దానను” అంటూనే వేల పాటలు పాడిన స్వరం. దేవ భూమి నుంచి ప్రభవించిన దివ్య స్వరం స్వరమే వరమై ఆ గానానికి ఎంతటి వారైనా వశమై.. ఆ గానామృతంలో పరవశించాల్సిందే.

కలికి చిలకల కొలికి అంటూ తెలుగు తెరను తాకిన ఆ మళయాళ మలయ మధురగాన సమీరం. మౌనంగానే ఎదుగుతూ.. వేణు మాధవుని వేణుగానంలా మనల్ని మైమరపించింది. ఆ మోవిపై వాలిన ప్రతిస్వరం గాంధర్వ గానమైంది. జామురాతిరి జాబిలమ్మలా జోల పాడింది. చిత్ర గాత్రానికి చకితులు కాని వారు లేరు. కఠం సవరించిన ప్రతిసారి సినిమా సంగీతాన్ని సుసపన్నం చేస్తున్న పాటసారి. కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు చిత్ర. ఆమెది సంగీత కుటుంబం.
Vijay Deverakonda : విజయ్ మరో పాన్ ఇండియా మూవీ..
చిన్నప్పుడే చిత్రలోని గాన ప్రతిభను తండ్రి కృష్ణన్నాయర్ గుర్తించారు. ఆయనే చిత్రకు ప్రథమ గురువుగా సంగీతంలో ఓనమాలు నేర్పారు. తరువాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డా కె. ఓనంకుట్టి వద్ద సంగీతంలో పూర్తిస్థాయి శిక్షణ పొంది, కేరళ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో పట్టాను సంపాదించారు. 1978లో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నైపుణ్య ఉపకారవేతనం పొందిన విద్యార్దిని.. అంతటి శిక్షణ పొంది సహజమైన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది కాబట్టే తర్వాత కాలంలో ఎన్నో విజయ శిఖరాలు అధిరోహించారు.
సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో కలికి చిలకలకొలికి అనే పాటతో తెలుగింటి స్వరవారసురాలైంది. పున్నాగ పువ్వులా పూసంత నవ్వించి మెప్పించింది సుశీలమ్మ, జానకమ్మల తర్వాత తెలుగు పాట తనదే అని గానాపథంగా చెప్పింది. ఆందుకే సినీ సంగీత ప్రపంచం నువ్వే నువ్వేకావాలంటోంది. ఆ రాగం విన్న వేళ బాల్య జ్ఞాపకాలు కళ్ళు ముందు కదలాడుతాయి. శ్రోత్రలకు ఒకే ఒక కోరిక ఆస్వరం వినాలని సర్వం మరచి ప్రతి క్షణం సేద తీరాలని పాటకు పట్టాభిషేకం జరిగింది.
Anushka Shetty : స్వీటీ మూవీ వాయిదా..
తన గాత్రంతో కోట్లమంది శ్రోతల మదిని దోచుకున్న చిత్ర ప్రతిభకు దక్కిన గౌరవమిది. చిత్ర పద్మభూషితురాలయ్యింది. అంటే.. స్వరవిన్యాసంతో ఏ భాషలో పాడినా ఆ సాహిత్యానికే వన్నె తెచ్చి పాడిన ప్రతిభాషలో స్పటికంత స్వచ్చమైన ఉచ్చారణతో భావాన్ని పలికించడంలో చిత్ర అమోఘం అనిపిస్తారు. లిటిల్ నైటింగేల్ పాడిన పాట ఆమె గాన ఖజనాలో వేల పాటలున్నాయి. ఎవ్వరికీ లేనన్ని జాతీయ, రాష్ట్రీయ అవార్డులున్నాయి. భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డ్ తో ఆమె ప్రతిభను మరింత ఉన్నతంగా చూసింది.
ప్రతిభతో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించినా చిత్రకు పెట్టని ఆస్తి ఆమె వినమ్రతే. అసలు చిత్రలోని అసలు ప్రతిభను వెలికి తీసింది ఇళయరాజా. అతితక్కువ కాలంలోనే తమిళం, మళయాళం, తెలుగు భాషలలో అత్యంత ప్రతిభావంతురాలైన గాయనిగా పేరు గడించారు. దేశవ్యాప్తంగా చిత్ర దాదాపు 30మందికి పైగా సంగీత దర్శకుల ట్యూన్స్ కు పాటలు పాడారు. ఇలా ఓ గాయని అంతమంది సంగీత దర్శకులతో కలిసి పని చేసింది. బహుశా చిత్ర మాత్రమేనేమో.. చిత్ర పాటల తోటలో పలు పాటలు నంది వర్ధనాలై పూచాయి.. చిత్రమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు..