Pawan Kalyan Janasena : జనసేన లోకి దారేది..?
జనసేన పార్టీ లోపలికి దారేది..?
రాజకీయాల్లో జనసేన పార్టీది చిత్రమైన పంథా.. ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త నాయకులు తమ పార్టీలోకి వస్తాం అంటే ఇరవై నాలుగు గంటలూ వారి కోసం ఆ పార్టీ తలుపులు తెరిచి ఉంచుతారు.. అది జగమెరిగిన సత్యం. అయితే జనసేన పార్టీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది అనేది బలం గా వినిపిస్తున్న మాట.. కొత్త నాయకుల సంగతి దేవుడెరుగు.. కనీసం సంవత్సరాల తరబడి పనిచేస్తున్న నాయకులకు కూడా ఆ పార్టీ నుండి కనీస గుర్తింపు లేక అధినేత పై గౌరవం తో ముందుకు సాగుతున్న పరిస్థితి..
జనసేన జనం లో ఉంది కానీ జనంలో జనసేన ఎక్కడ..?
రాష్ట్రంలో జనంలో వైసీపీ టీడీపీ లతో సమానంగా బలంగా ఉన్న పార్టీ జనసేన.. అయితే మిగితా రెండు ప్రధాన పార్టీలకు నాయకులు తోడుగా ఉంటే జనసేనకు మాత్రం కార్యకర్తలు, దాన్ని నమ్మిన అభిమానులూ అండగా ఉన్నారు. నిజానికి జనసేన పార్టీని ఇన్నాళ్లూ నడిపింది వాళ్లే అంటే అతిశయోక్తి కాదు.. 2019 ఘోర పరాజయం తర్వాత పార్టీని జనం లోకి తీసుకువెళ్లింది.. ఆ పార్టీని నిలబెట్టింది జనసేన కార్యకర్తలూ అభిమానులూ మాత్రమే.. 2024 లో పవన్ ని సీఎం గా చూడాలి అనే కోరిక తో జనసేనను జనంలోకి తీసుకు వెళ్ల గలిగారు గానీ దాన్ని ఓట్ గా మార్చుకునే ప్రయత్నం జనసేన పార్టీ ఎంత వరకూ చేసింది అనేదే ప్రశ్న. అసలు జనసేనను నడిపినట్టు వైసీపీ, టీడీపీ లను నడిపితే ఆ పార్టీలు సమాధి అయ్యి చాలా ఏళ్ళు అయి ఉండేవి. అయితే జనసైనికులు ఇంత కష్టపడి జనంలో జనసేనను నిలబెట్టగలిగినా.. జనసేన పార్టీ తమ వంతుగా జనంలోకి ఎంత వరకూ వెళ్లగలిగింది..? పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో కౌలు రైతులకు చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని కూడా జనంలోకి తీసుకుని వెళ్లడం లో జనసేన పార్టీ పూర్తిగా విఫలమైంది. ఓ సామాన్య కార్యకర్త సరైన నాయకత్వం లేకుండా ఎంతవరకూ పార్టీని ముందుకు తీసుకు వెళతాడు.? తీసుకు వెళ్లగలడు..?
Also Read : తెలంగాణా లో హంగ్ వస్తుందా..?
పవన్ కళ్యాణ్ కి తప్పుడు సమాచారం..
పార్టీ ని ఎలా నడిపినా.. నాయకులు లేకున్నా కేవలం పవన్ కళ్యాణ్ పై అభిమానంతో మొన్న శ్రీకాకుళం సభ వరకూ ఉవ్వెత్తున ఎగసిపడిన జనసైనికులు ఆ రోజు సేనాని స్పీచ్ తో నీరుగారిపోయారు అన్నది వాస్తవం. ఆ రోజు పవన్ మాట్లాడిన మాటలు వింటే పవన్ కి ఎవరో తప్పుడు సమాచారం అందిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఒంటరి గా వెళితే వీరమరణం అన్న సమాచారం పవన్ కి ఎవరు ఇచ్చారు..? నిజానికి పవన్ ఒంటరిగా వెళితే అది టీడీపీ కి మరణం తప్ప జనసేనకు ఎంత మాత్రమూ కాదు. ప్రజల్లో “అంతకు ముందు చంద్రబాబు కి వోట్ వేశాం.. తర్వాత జగన్ కూ వేశాం.. రేపు పవన్ కి వేద్దాం..” అనే ఆలోచన ఉంది. ఒకప్పటి తో పోలిస్తే జనసేన పై జనం లో సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రజారాజ్యం లా కాదు రా ఓడిపోయినా రాజకీయాల్ని వదల్లేదు అనే సానుభూతి ఉంది. అందుకే జనసేన లోకి జాయిన్ అవడానికి చాలా మంది నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..!! మరి ఈ విషయం జనసేన గమనించిందా..? అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పార్టీ లోకి ఆహ్వానించే ఉద్దేశం ఆ పార్టీకి ఉందా..?
అసలు జనసేన పార్టీ లోపలికి దారేది..?
జనసేన లోకి జాయిన్ అవడానికి నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా.. ఆపార్టీ లోకి వెళ్లాడనికి దారి తెలీక చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. అసలు జనసేన లో జాయిన్ అవడానికి ఎవరిని సంప్రదించాలి..? ఎవరిని కలవాలి..? పవన్ కళ్యాణ్ అపోయింట్మెంట్ కావాలి అంటే ఎలా..? అన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం అయితే ఇది కాదు. అసలు జనసేన పార్టీ ఉద్దేశం ఏమిటి..? నాయకులు కావాలి అనా? వద్దు అనా..? కావాలి అంటే నాయకుల కోసం జనసేన చేసిన ప్రయత్నాలు ఏమిటి..? లేదా జనసేన లోకి రావాలి అన్న వాళ్లకు జనసేన లోకి ఎంట్రీ ఎలా..? అన్నీ ప్రశ్నలే..
Also Read : US Elections అక్కడ ఏలేది మనోళ్లే…
అసలు జనసేన చేయాల్సింది ఏమిటి..?
పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని రాష్ట్రంలో చాలా మందికి ఉన్న కోరిక. అది పవన్ కళ్యాణ్ తీర్చాల్సిన బాధ్యత. ఇంత మంది తన మీద పెట్టుకున్న నమ్మకాలకి ఆశకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఇకనైనా పార్టీని నడపాలి. చాలా చోట్ల లోకల్ గా కమిటీలు లేవు. కమిటీలు ఉన్నచోట పార్టీ నుండి దిశా నిర్దేశాలు లేవు. ముందు దానిపై దృష్టి సారించాలి. అలానే పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలి అని మనస్ఫూర్తిగా బలం గా కోరుకునే వాళ్ళని కొందరిని ఎన్నుకోవాలి. వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. ప్రతి నియోజకవర్గం నుండి పార్టీ కోసం ఇప్పటి వరకూ పని చేసిన వాళ్లలో సమర్థులు ఉంటే వాళ్ళను.. లేకుంటే కొత్తగా జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పార్టీ లోకి తీసుకోవాలి. ఎలక్షన్స్ కి ఎంతో దూరం లేదు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినపుడు చూసుకుందాం అంటే.. ఇప్పటికే కార్యకర్తలు నిరుత్సాహం గా ఉన్నారు. మిగితా రెండు పార్టీలతో చూసుకుంటే నియోజక వర్గాలలో రేస్ లో తాము ఎక్కడ ఉన్నాం అనేది చూసుకుంటున్నారు. వాళ్ళు కోరుకునేది సమర్ధ నాయకత్వం, దిశ, నిర్దేశం..వాళ్ళు పూర్తిగా నిరుత్సాహంలోకి వెళ్లక ముందే జనసేన ఆ విషయం పై దృష్టి పెడితే అది ఆ పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది. మిగితా రెండు పార్టీల లా జనసేన కూడా సరైన రాజకీయం చేసిన నాడు రాష్ట్రమ్ లో జనసేన ను ఆపే శక్తి మాత్రం ఎవరికీ ఉండదు. ఆ రోజు త్వరగా రావాలి అని కోరుకుందాం..
Also Read : జగనన్న స్టిక్కర్లు.. ముందు ముందు పచ్చ బొట్లేనా..?