Samantha : సినీ తెరంగేట్రం చేసిన కుందనపు బొమ్మ సమంత తన నటనతో ఏదో మాయ చేసింది. వెండితెరపై చూడగానే కుర్రకారు చిట్టిగుండె గట్టిగా కొట్టుకుంది. బుంగమూతి మాటలతో మత్తుచల్లి అందాలతో దాడి చేసే ఆడపులి. శీతాకాలం సూర్యుడిలాగా సూటిగ తాకే చూపులతోటి తనువును గుచ్చేసి తరిమే తుంటరి తూఫాను సమంత. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె పూర్తి పేరు సమంత రుతు ప్రభు.
సమంత రుతు ప్రభు 28 ఏప్రిల్, 1987 చెన్నైలో జన్మించింది. తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో నటించి ప్రేక్షకుల మెప్పుపొందింది.
అతితక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. ఏ మాయ చేశావే సినిమాకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డ్ సామ్ ను వరించాయి. బృందావనం, జబర్దస్త్, రామయ్యా వస్తావయ్యా, మనం, రభస, మహానటి, యూ టర్న్, రంగస్థలం వంటి చిత్రాలు ఆమె విలక్షణమైన నటనకు అద్దం పట్టాయి.
తన మనస్సుకు నచ్చిన వాడైన నాగచైతన్యతో ఆశపడుతూ ఏడడుగులేసింది. పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటించిన నటీమణులు చాలా అరుదు. అందులో ఒకరు సమంత. సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో జరిగింది. అక్టోబరు2, 2021న వ్యక్తిగత కారణాల వల్ల వారు విడిపోయారు. సమంత గత కొంతకాలంగా ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంది. పరిస్దితులకు ఎదురీది ఆశావహ దృక్పథంతో మళ్లీ తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
శాకుంతలం, యశోద చిత్రాలు అమె నటలోని మరో పార్శవాన్ని పరిచయం చేశాయి. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలోనూ నటిస్తోంది సామ్. అమెరికన్ యాక్షన్ టీవీ సిరీస్‌కు హిందీ రీమేక్‌గా రాజ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఈ ముద్దుగుమ్మ బొద్దుగా వున్నా.. చిక్కినా అందమే. వచ్చిన అవకాశం ఎదైనా ఊ.. ఊ.. ఆనకుండా ఊ…. అంటూ దూసుకుపోతుంది.
ప్రత్యూష ఫౌండెషన్ ద్వారా అనేక స్వచ్చంద సేవాకార్యక్రమాలు, క్యాన్సర్ చికిత్సకు చేయూత చిన్న పిల్లల గుండె జబ్బులకి శస్త్ర చికిత్సకు చేదోడు అందిస్తున్న దేవత కాబట్టే అభిమానుల గుండెల్లోనే కాకుండా నిజంగా గుడిలో కొలువుతీరుతోంది. కోహినూరులాంటి కొండమల్లి, మంచి మమతను పంచే సమంత సినీవనంలో మరిన్ని అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మనల్ని మరింతగా అలరించాలని ఆశిద్దాం..
Discussion about this post