Tholi Ekadashi : తొలి ఏకాదశి హిందువులకు మొదటి పండుగ. ఈ పండుగ నుండి వరుసగా సంవత్సరం మొత్తం హిందూ దేవాలయాలు పూజలతో విరాజిల్లుతాయి. దేశవ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆలయాలను చూడముచ్చటగా ముస్తాబు చేస్తారు. భక్తులందరూ నదులలో పుణ్య స్నానాలను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశికి శయనైకాదశి, హరి వాసరం, పేలాల పండగ అనే పేర్లు కూడా కలవు.
ఈరోజు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనానికి ఉపక్రమించి నాలుగు నెలల శయనిస్తాడు. తిరిగి మరల అక్టోబర్, నవంబర్‌లల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసాంగా పిలుస్తారు. తొలి ఏకాదశి తిధి తెల్లవారుజామున 3:18 నిమిషాలకు మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం 2: 42 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు మాంసం, మద్యం జోలికి అసలు వెళ్ళకూడదు.

వెల్లుల్లి, ఉల్లిపాయతో చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి జాగరణ చేస్తే.. సకల సౌభాగ్యాలు సమకూరుతాయని పండితులు చెబుతున్నారు. భక్తులు చతుర్మాస దీక్షలను ఇవాల్టి నుంచి మొదలయ్యే చతుర్మాస వ్రతం నుండి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ద్వాదశి రోజు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం ఆచరించి ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమిస్తారు.
తొలి ఏకాదశినాడు ఆవులను పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ఆహారంగా తీసుకుంటారు. ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైన ఆహారమని వారిని స్మరించుకోవడం కోసం పేలాలను ఈరోజు
తప్పకుండా ఆహారంగా తీసుకోవడం ఆనవాయితీ. అందుకే ప్రతి ఒక్క ఆలయంలో తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ప్రసాదంగా పెడుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తుల రాక ఎక్కువగా ఉంటుందని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
