Pawan Kalyan : వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం తొలి బహిరంగ సభ కత్తిపూడిలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. అధికార పార్టీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలి..? అని అన్నారు.
18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో మనమున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంపదను దోచి, మళ్లీ దాన్ని ప్రజలకు పంచి పెట్టి నాయకులు కావాలో, సంపద సృష్టించి అన్నీ వర్గాలకు పంచి పెట్టే పాలన కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షుల పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రజల గొంతు బలంగా వినిపిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా? ఉమ్మడిగా వస్తుందా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఆ రోజు వస్తే ఖచ్చితంగా ప్రజల మధ్య పారదర్శకంగా చెబుతాం.
కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో నేను ఓడిపోయెలా చేశారు. లక్షమంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది కుట్ర కాకా ఇంకేంటి? అని ఆయన ప్రశ్నించారు. జనసేన ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడదు. మేము కేవలము అధికార పార్టీని మాత్రమే ప్రశ్నిస్తాము, వాటికి మాత్రమే వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం లో ఉద్యోగాలు లేవు నిరుద్యోగం రాజ్యామేలుతుంది.
పన్నుల భారంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. 200 మంది రైతుల ఆత్మహత్యలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా.. అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోపక్క అధికార పార్టీ అండతో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఎందరో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటిని ప్రశ్నించాలంటే నిఖార్సైన మన జనసేన అధికారంలోకి రావాలి, కాబట్టి ప్రజలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.