Pareshan Movie Review : నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అబిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల, తదితరులు
రచన, దర్శకత్వం: రూపక్ రోనాల్డ్సన్
నిర్మాత: సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
మ్యూజిక్ : యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్
విడుదల తేదీ: జూన్ 2, 2023
సూపర్ హిట్ మూవీ మసూదా ఫేమ్ తిరువీర్, హీరోయిన్ పావని కర్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ పరేషాన్. ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించగా.. రూపక్ రోనాల్డ్సన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
స్టోరీ :
క్రైస్తవ మతానికి చెందిన సమర్పణ్ (మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) తిరుగుబోతు. ఐటీఐ కూడా పాసవ్వక ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు. దాని కోసం ఉన్నతాధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతికి ఉన్న బంగారు గాజులు అమ్మి రెండు లక్షలను జమ చేస్తాడు.
ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్ని పంపిస్తే.. అందులో కొంత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా (బన్నీ అభిరామ్)కు ఇస్తాడు. మిగిలిన డబ్బు మరో స్నేహితుడు ఆగమ్ సత్తి (అర్జున్ కృష్ణ)కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్ ప్రేయసి శిరీష (పావని కరణం)తో శారీరకంగా దగ్గర అవుతాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలకుంటాడు.
డబ్బులు జమ చేస్కోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే.. డబ్బులు కొట్టేస్తారు. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లంచం కోసం ఇచ్చిన డబ్బుని కొడుకు తన స్నేహితులకు ఇచ్చాడని తెలిశాక సమర్పణ్ రియాక్షన్ ఏంటి? స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్.. వీటిని ఐజాక్ ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ.
రివ్యూ :
టాలీవుడ్ ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. తెలంగాణ నేపథ్యంలో కథలను తెరకెక్కిస్తోంది. ‘జాతి రత్నాలు’, ‘బలగం’, ‘దసరా’… ఈ కోవలోనివే కాగా మరికొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే, తెలంగాణ ఆత్మను కొన్ని చిత్రాలే ఆవిష్కరించాయి. అందులో ‘పరేషాన్’ కూడా చేరుతుంది. ‘పరేషాన్’లో అందమంతా తెలంగాణ నేటివిటీలో, ఆ క్యారెక్టర్లలో ఉంది. కథేమీ కొత్తది కాదు.. ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, అమ్మాయితో ప్రేమకథ, ఓ సమస్య, చివరలో హ్యాపీ ఎండింగ్. ‘పరేషాన్’లోనూ అంతే!
కథలో కొత్తదనం లేదు. కానీ, ప్రతి కామెడీ సన్నివేశంలోనూ తెలంగాణ కొట్టొచ్చినట్టు కనపడింది. క్యారెక్టర్ డిజైనింగ్‌లో అసలు కల్మషం లేదు. దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు. ‘వెలుగు వెలుగు…’ సాంగ్ అందర్నీ నవ్విస్తుంది. క్రైస్తవ మత ప్రార్థనలు, మందు తాగే కొన్ని కామెడీ సీన్లను విశ్లేషించలేం.. చూసి నవ్వుకోవాలంతే! ఇంటర్వెల్ ముందు ఉన్నంత కామెడీ ఆ తర్వాత లేదు.
కామెడీ నుంచి ఎమోషన్‌కు వచ్చిన ప్రతిసారీ సినిమా డల్ అయ్యింది. తెలంగాణ నేపథ్యం అంటే తాగుడును గ్లోరిఫై చేస్తున్నట్టు అనిపించింది. మరీ అంత ఎక్కువ మద్యపానాన్ని చూపించాల్సిన అవసరం లేదేమో!? తెరపై తెలంగాణ పల్లె ఆత్మను చక్కగా ఆవిష్కరించారు కానీ కథలో ఆత్మ ఉందో? లేదో? చూసుకోలేదు. కామెడీ మీద భారం వేసి బండి లాగించారు. తాగుడు సీన్లు కొన్ని రిపీటెడ్ అనిపిస్తాయి.
నటీనటులు ఎలా చేశారంటే..
తిరువీర్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటాడు. పరేషాన్లో కూడా అంతే. ఐజాక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్ సత్తిగా అర్జున్ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్గా, పాషాగా బన్ని అభిరామ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే..
యశ్వంత్ నాగ్ సంగీతం బాగుంది. సౌ సారా, ముసి ముసి నవ్వుల మంజుల పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణ పల్లె అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* హీరో, హీరోయిన్ యాక్టింగ్
* మ్యూజిక్
* నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
* రోటిన్ స్టోరీ
* ఎక్కువైన తాగుడు సీన్లు
* తగ్గిన కామెడీ
* నో కంక్లూషన్
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్ : స్క్రీన్ మీద ఉన్నోళ్ళకు పరేషాన్.. థియేటర్లలో ఆ స్క్రీన్ ముందు ఉన్నోళ్ళకు ఫన్. పరేషాన్ ఒక యూత్‌ఫుల్ మూవీ.