Samajavaragamana Movie Review : నటీనటులు : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు
డైరెక్టర్ : రామ్ అబ్బరాజు
నిర్మాత : రాజేష్ దండా
మ్యూజిక్ : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : రాంరెడ్డి
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
విడుదల తేదీ : జూన్ 29, 2023
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఒక పక్క వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే, మరోపక్క ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ లో కూడా నటిస్తూ మంచి గుర్తింపుని సందించుకున్నాడు. తాజాగా ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘సామజవరగమన’. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సామజవరగమన ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అసలు ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాం..
కథ :
బాలు (శ్రీవిష్ణు) ప్రేమలో విఫలం అయ్యి, ప్రేమ పైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐలవ్ యూ చెబితే వెంటనే రాఖీబికట్టించుకుంటుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు (రెబా మౌనికా జాన్) తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది.
దీంతో బాలు, సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది. చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? ఈ మధ్యలో సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్ర ఏమిటి? అలాగే బాలు తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పాసైతే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
రివ్యూ :
సామజవరగమన కథలో పెద్ద విషయం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే… ప్రేమించిన అమ్మాయి చెల్లెలు వరుస అవుతుందని తెలిసి హీరో ఏం చేశాడు? అనేది కాన్సెప్ట్! కానీ, కామెడీ ఫుల్లుగా ఉంది. అబ్బాయిని అమ్మాయి ఎందుకు ప్రేమించింది? అని చెప్పడానికి మంచి కారణం రాసుకున్నారు దర్శక, రచయితలు! అయితే, అబ్బాయి ప్రేమలో పడటం, మిగతా కథలో అంత బలం ఉండదు. ప్రతిదీ సినిమాటిక్‌గా ఉంటుంది.
ముఖ్యంగా.. హీరో హీరోయిన్లు వరుసకు అన్నా చెలెళ్ళు కారని మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. చివరకు, ఆ సమస్యకు ముగింపు ఎలా ఇస్తారో ముందు చెప్పొచ్చు. కథ కంటే కామెడీపై దర్శక, రచయితలు ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు. మెజారిటీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. ఇన్నాళ్ళూ చదవడం లేదని కొడుకులను తిట్టే తండ్రులను చూశాం. ఇప్పుడు తండ్రిని కొడుకు తిడుతుంటే.. ఆ సీన్స్ కాస్త కొత్తగా నవ్విస్తాయి.
శ్రీవిష్ణు, నరేష్ టైమింగ్ కేక. కులశేఖర్ పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ సైతం కొన్నిచోట్ల నవ్వించారు. అమ్మాయిల రాఖీ గురించి శ్రీవిష్ణు చెప్పే మోనోలాగ్, ‘జెర్సీ’ ట్రైన్ సీన్ స్పూఫ్, కులశేఖర్ పాత్ర సీన్స్ మర్చిపోవడం కష్టం! కులశేఖర్ కామెడీ యూట్యూబ్‌లో సాత్విక్ చేసే ‘మన కులపోడే’ వీడియోలను గుర్తు చేస్తుంది. కథను, కథనాన్ని, లాజిక్కులను మర్చిపోయి తెరపై వచ్చే సన్నివేశాలను చూసి నవ్వేలా సినిమా తీయడంలో రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు.
కొన్ని డబుల్ మీనింగ్స్ తరహా డైలాగులు పంటి కింద రాయిలా తగులుతాయి. మొత్తం మీద ఇటువంటి క్లీన్ కామెడీ ఫిల్మ్ తీయడం కత్తి మీద సాము అని చెప్పాలి. బాలు పాత్రలో శ్రీవిష్ణు జీవించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్. శ్రీ విష్ణు, నరేష్ మధ్య కెమిస్ట్రీ బావుంది. వాళ్ళిద్దరి కలయికలో సన్నివేశాలు ఎక్కువ నవ్విస్తాయి. శ్రీవిష్ణు, మోనికా జాన్ జోడీ చూడముచ్చటగా ఉంది.
రాజీవ్ కనకాల మరోసారి ఎమోషనల్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్, ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్.. ముగ్గురూ నవ్వించారు. ఇతర ప్రధాన తారాగణం పాత్రల పరిధి మేరకు చేశారు. గోపీససుందర్ పాటలు, నేపథ్య సంగీతం బావుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆట్టుకుంటుంది.
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ సామజవరగమన..