ఇంటిముందు మొలిచిన
రెండు పూలమొక్కలా ఏమిటీ
ఈ అమడాల మర్కపిల్లలు
ఇవి చెంగుచెంగున దుంకుతూ
బతుకువాకిట్లో
బండారుతో పట్నమేస్తుంటే
ఒళ్ళంతా కళ్ళుంటే బాగుండనిపిస్తుంది.
కాళ్ళు ,మెడ దొరికిచ్చుకొని
గెగ్గెలో వేసినపుడు
పెద్దమ్మకథలోని కాటమరాజును
కండ్లముందట చూస్తున్నట్టే ఉంటది.
పచ్చని గరికపోసల్ని
కందిమండ కొనల్ని
లేత య్యాపరిల్లల్ని
గెగ్గె చుట్టు గజ్జెల లెక్క వేలాడదీసినపుడు
వాయిలుకర్రల గెగ్గె
పసిబిడ్డల తొట్టెలౌతుంది.
మేకపంచకం,మేకపెంట
మాకెప్పుడూ రొచ్చనిపించలేదు
పిల్లలకు అమ్మతల్లి పోసినపుడు
మేకపెంట పొగనే
ఇంట్లో అగరుదూపం.
జాలమేక,పూలమేక
పెద్దమేక,బింగిచెవుల మేక…
కనుకున్న బిడ్డలకు పేరు వెట్టినట్టు
మేకలకు ఎన్నిరకాల పేర్లు పెడుతడో నాయిన.
పదినగలై,ఇరవై నగలై
ఇంటిల్లిపాదిని
ఈ మేకలే సాదుతుంటయి.
ఎక్కరాని గట్లకెక్కి,దిగరాని గట్లకు దిగి
నాయిన మేకలకాస్తుండంటే
ఈ మేకపాల గట్టిదనమే.
తిప్పగమేసిన తల్లిమేక
బియ్యంకడిగిన నీళ్ళను
ఉరుకొచ్చి గటగటా తాగుతుంటే
డొక్కలెండిన నాయిన కడుపు కూడా నింతది.
రెండు మేకపిల్లలతో పాటు
నేనూ దానిపొదుగు ముందు మేకపిల్లనై
నోట్లోకి పాలు పిండుకుంటుంటే
ఈ మేకేమిటీ?
ముఖం మీద
నురుగుపూలను పూయిస్తుంది తల్లిలాగ !!!
//తగుళ్ళ గోపాల్